టైమ్ మేగజైన్ 'కిడ్ ఆఫ్ ది ఇయర్'గా భారత సంతతి బాలిక గీతాంజలి!

  • 15 ఏళ్ల బాలికకు అరుదైన గుర్తింపు
  • యువ శాస్త్రవేత్తగా అద్భుత ప్రతిభ
  • ఇంటర్వ్యూ చేసిన ఏంజెలినా జోలీ
15 ఏళ్ల ఇండియన్‌ అమెరికన్‌ గీతాంజలి రావుకు ప్రతిష్ఠాత్మక 'టైమ్' మేగజైన్ నుంచి అరుదైన గుర్తింపు లభించింది. గీతాంజలిని యువ శాస్త్రవేత్తగా ‘కిడ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా గుర్తించింది. తాగునీటి కాలుష్యం, డ్రగ్స్‌ వాడకం, సైబర్‌ వేధింపులు.. తదితర సమస్యలకు గీతాంజలి టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మేగజైన్ ప్రశంసించింది.

దాదాపు 5 వేల మందితో పోటీ పడి గీతాంజలి రావు ఈ అవార్డును సాధించారని టైమ్ వెల్లడించింది. ఇక, గీతాంజలిని హాలీవుడ్‌ నటి ఏంజెలినా జోలి వర్చువల్‌ విధానంలో ఇంటర్వ్యూ చేయడం విశేషం. ఏంజెలినా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన గీతాంజలి, "గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం" తన ప్రయోగమని వెల్లడించింది.

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాస్త్రీయ దృక్పథమున్న యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని, యువతను సమ్మిళితం చేస్తూ, ఓ అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలన్నది తన అభిమతమని పేర్కొంది. కంటపడిన ప్రతీ సమస్యనూ పరిష్కరించాలని అనుకోవడం కన్నా, బాగా కదిలించిన సమస్య గురించి ఆలోచించి, పరిష్కారం కోసం ప్రయత్నిస్తే మంచిదని అభిప్రాయపడింది. ఈ తరం ప్రజలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రతి ఒక్కరినీ సంతోషంగా చూడాలన్నదే తన లక్ష్యమని, దానికోసం సైన్స్ ను వినియోగించుకుంటానని అన్నారు.


More Telugu News