ఓట్ల లెక్కింపు సమయంలో జాగ్రత్త.. ఏజెంట్లతో మంత్రి కేటీఆర్

  • ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం
  • ప్రత్యర్థి పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
  • గెెలుపు తమదేనని ధీమా
గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. మంత్రి నిన్న తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. మంత్రులు, పార్టీ అభ్యర్థులు, శాసనసభ్యులు, మండలి సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. లెక్కింపు సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్క ఓటు కీలకమేనని, కాబట్టి అత్యంత జాగురూకతతో వ్యవహరించాలని అన్నారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు వివాదాలతో సమస్యలు సృష్టించాలని చూస్తాయని అన్నారు.

ఫలితాలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వస్తాయని, అత్యధిక స్థానాలను గెలుచుకుని మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను గెలుచుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమన్న మంత్రి.. లెక్కింపు ప్రక్రియకు హాజరయ్యే ఏజెంట్లకు పలు సూచనలు చేశారు.

కాగా, ఫలితాల వెల్లడి నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ అనుభవజ్ఞులైన నేతలు, నిపుణులు అందుబాటులో ఉంటారని, సందేహాలు తలెత్తితే వెంటనే వారిని సంప్రదించాలని కోరారు.


More Telugu News