భారీ రేటుకి అమ్ముడైన రష్మిక 'పొగరు' హక్కులు!

  • రష్మిక, ధ్రువ్ సర్జా జంటగా కన్నడలో 'పొగరు' 
  • తెలుగు వెర్షన్ హక్కులు 3.3 కోట్లకు విక్రయం  
  • 'కరాబు మైండు' పాటకి మిలియన్లలో వ్యూస్  
  • తెలుగు, కన్నడ భాషల్లో వచ్చే ఏడాది రిలీజ్
ప్రెట్టీ హీరోయిన్ రష్మిక మందన్నకు ఈవేళ తెలుగులో వున్న క్రేజే వేరు. వరుస విజయాలతో అగ్రతారగా ఇప్పుడు రాణిస్తోంది. స్టార్ హీరోలు సైతం ఆమెను బుక్ చేయమని నిర్మాతలకు రికమండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె కన్నడలో 'పొగరు' అనే సినిమాలో నటిస్తోంది. ధ్రువ్ సర్జా కథానాయకుడుగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని కూడా ఏకకాలంలో నిర్మిస్తున్నారు. దీంతో రష్మికకున్న క్రేజ్ ను బట్టి ఈ చిత్రం తెలుగు హక్కులు 3 కోట్ల 30 లక్షల ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని చిత్రం హక్కులు తీసుకున్న వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత డి.ప్రతాప్ రాజు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఆయన సాయిసూర్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదల చేయనున్నారు.

ఇక ఈ చిత్రంలోని 'కరాబు మైండు కరాబు, మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు' అంటూ సాగే పాటను యూట్యూబ్ లో విడుదల చేశారు. కన్నడ వెర్షన్ లో ఈ పాటకు యూట్యూబ్ లో 170 మిలియన్ వ్యూస్ వచ్చాయని, తెలుగు పాటకి 43 మిలియన్ వ్యూస్ వచ్చాయని నిర్మాత ప్రతాప్ రాజు చెప్పారు. ఈ పాటకి ఇంత క్రేజ్ రావడం వల్లే సినిమా హక్కులకు పోటీ ఏర్పడిందనీ, తాము 3.3 కోట్లు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకున్నామని ఆయన తెలిపారు.

పోతే, కన్నడలో ఈ సినిమా టైటిల్ 'పొగరు' అనీ, తెలుగు వెర్షన్ కి ఇంకా టైటిల్ నిర్ణయించలేదని ఆయన చెప్పారు. కాగా, వచ్చే ఏడాది తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


More Telugu News