పెన్షన్ల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు.. జగన్ సీఎంగా ఉండటం మన అదృష్టం: జనసేన ఎమ్మెల్యే రాపాక

  • పేదల కోసం జగన్ లక్షల ఇళ్లను ఇస్తున్నారు
  • లక్షలాది ఉద్యోగాలను ఇచ్చిన ఘనత జగన్ ది
  • వాలంటీర్ వ్యవస్థను దేశంలో అందరూ ప్రశంసిస్తున్నారు
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. సంక్షేమ పథకాలపై శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదల పెన్షన్లపై మాట్లాడే అర్హత కూడా తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జగన్ లాంటి ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టమని కొనియాడారు. పేదల ఇంటి కల అప్పట్లో వైయస్సార్ సాకారం చేశారని... ఇప్పుడు అదే పనిని జగన్ చేస్తున్నారని చెప్పారు. పేదల కోసం జగన్ లక్షల ఇళ్లను ఇస్తున్నారని అన్నారు.

లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించిన ఘనత జగన్ దని రాపాక ప్రశంసించారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామంలో 30 నుంచి 40 మంది వాలంటీర్లను నియమించారని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ అద్భుతమంటూ దేశంలోని అందరూ ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఇంతకు ముందు ప్రతి పనికీ ఎమ్మెల్యే ఇంటి ముందు పేదలు బారులు తీరేవారని... వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఆ అవసరం లేకుండా పోయిందని చెప్పారు.


More Telugu News