బాణసంచా విషయంలో ఎన్జీటీ కీలక ఆదేశాలు!

  • కాలుష్య ప్రాంతాల్లో బాణసంచాపై పూర్తి నిషేధం 
  • క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి 11.55 తరువాత అరగంటకు అనుమతి
  • హరిత టపాసులు మాత్రమే కాల్చుకోవచ్చన్న గ్రీన్ ట్రైబ్యునల్
బాణసంచా విక్రయాలు, వాడకం విషయంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండి, గాలి నాణ్యత తక్కువగా ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో బాణసంచాపై పూర్తి నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. దేశ రాజధాని ప్రాంతం సహా కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉన్న అన్ని చోట్లా ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కరోనా కేసుల ఉద్ధృతి ఇంకా తగ్గనందున, కాలుష్యం పెరిగితే కేసుల సంఖ్య పెరుగుతుందని వ్యాఖ్యానించిన ఎన్టీటీ చైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఇక రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల్లో రాత్రి 11.55 నుంచి 12.30 వరకూ పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్ పటాసులు మాత్రం కాల్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

కాగా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రెండు గంటల పాటు బాణసంచా కాల్చేందుకు అనుమతి ఇస్తూ, గతంలో తామిచ్చిన ఆదేశాలు అమల్లోనే ఉంటాయని, అయితే, ధ్వని స్థాయి మాత్రం తక్కువగా ఉండాల్సిందేనని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ఒకసారి జరిమానా చెల్లించి, రెండోసారి ఉల్లంఘిస్తే, రెట్టింపు జరిమానా పడుతుందని హెచ్చరించారు. కరోనా కాలంలో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టేలా బిజినెస్ చేసుకుంటామంటే అంగీకరించబోమని ఆదర్శ్ కుమార్ తేల్చి చెప్పారు.


More Telugu News