పోలీసులమని చెప్పి.. జగ్గయ్యపేట బంగారు వ్యాపారి నుంచి కిలో బంగారు బిస్కెట్లతో పరార్!

  • చెన్నై నుంచి కిలో బంగారు బిస్కెట్లతో బయలుదేరిన వ్యాపారి
  • ఒంగోలు బస్టాండులో బస్సెక్కిన దుండగులు
  • ఐడీ పార్టీ పోలీసుల పేరుతో బిస్కెట్లతో ఉడాయింపు
పోలీసుల పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బంగారు వ్యాపారికి టోపీ వేశారు. ఏకంగా కిలో బంగారు బిస్కెట్లు లాక్కుని పరారయ్యారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో నిన్న రాత్రి జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వ్యాపారి ఒకరు ఆభరణాలు తయారీ కోసం చెన్నై నుంచి కిలో బంగారు బిస్కెట్లు తీసుకుని బయలుదేరాడు.

 నెల్లూరు వరకు ఓ వాహనంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో విజయవాడ బయలుదేరాడు. ఒంగోలు బస్టాండులో బస్సెక్కిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తాము ఐడీ పార్టీ పోలీసులమని, తనిఖీ చేయాలని చెప్పి వ్యాపారిని కిందికి దింపారు. అనంతరం ఆయన వద్ద ఉన్న బంగారు బిస్కెట్లను తీసుకుని పరారయ్యారు.

షాక్ నుంచి తేరుకున్న వ్యాపారి విషయాన్ని వెంటనే ఒంగోలు వర్తక సంఘం దృష్టికి తీసుకెళ్లాడు. వారు పోలీసులను ఆశ్రయించారు. విషయం విన్న పోలీసులు తాము ఎవరి నుంచీ బంగారం స్వాధీనం చేసుకోలేదని చెప్పడంతో విస్తుపోయారు. ఈ విషయమై డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ చెబుతూ, వర్తక సంఘం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.


More Telugu News