తీరం దగ్గరికి చేరుతున్న 'బురేవి' తుపాను... కేరళలో రెడ్ అలర్ట్!

  • నేడు శ్రీలంక వ్యాప్తంగా అతి భారీ వర్షాలు
  • 4న ఉదయం తమిళనాడు తీరాన్ని దాటనున్న తుపాను
  • ఆపై కేరళపై పెను ప్రభావం ఉంటుందన్న ఐఎండి
బంగాళాతంలో ఏర్పడిన అల్పపీడనం తొలుత వాయుగుండంగా, ఆపై తుపానుగా మారిందని ఈ ఉదయం ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి 'బురేవి' అన్న పేరును పెట్టామని, ఇది 4వ తేదీ ఉదయం తమిళనాడులోని కన్యాకుమారి, పంబం తీరంలో తీరాన్ని దాటి, కేరళ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. కేరళలోని తిరువనంతపురం జిల్లాపై దీని ప్రభావం అధికమని, 5వ తేదీ వరకూ కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

ఇదే తుపాను శ్రీలంకపైనా పెను ప్రభావాన్ని చూపుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది ట్రింకోమలీకి 330 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించిన అధికారులు, నేడు శ్రీలంకలో అతి భారీ వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. గురువారం నాటికి ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్ మొత్తం విస్తరిస్తుందని, ఆపై భారత్ దిశగా సాగి, తమిళనాడు, కేరళపై విరుచుకుపడుతుందని తెలియజేశారు. బురేవీ ప్రభావంతో తమిళనాడుతో పాటు రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఈ తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఇప్పటికే తూత్తుకుడి ప్రాంతానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ప్రారంభించాయి. తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో 65 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.


More Telugu News