ఏలియన్స్ కానే కాదు... 'లోహపు దిమ్మె' పని మానవులదే... ఫోటోలివిగో!

  • తొలుత ఉటా ఎడారిలో కనిపించిన దిమ్మె
  • నలుగురు మనుషులు దాన్ని తొలగిస్తుండగా చిత్రాలు
  • పోస్ట్ రోస్ బెర్నార్డ్
తొలుత యూఎస్ లోని ఉటా ఎడారిలో ఆపై రొమేనియా డేసియన్ కోట సమీపంలో కనిపించి, ప్రపంచమంతా చర్చనీయాంశమైన లోహపు దిమ్మె మిస్టరీ వీడింది. ఇది ఏలియన్స్ పని అయ్యుండచ్చంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలలో వాస్తవం లేదని తేలింది. ఇది మానవుల పనేనని వెల్లడించేందుకుసాక్ష్యాలు బహిర్గతమయ్యాయి. నలుగురు మనుషులు ఉటా ఎడారిలోని లోహపు దిమ్మెను అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఫొటోగ్రాఫర్ రోస్ బెర్నార్డ్ మంగళవారం నాడు విడుదల చేశారు.

శుక్రవారం నాడు తాను లోహపు దిమ్మెను సందర్శించానని తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్న ఆయన, ఆపై రాత్రివేళ తాను అక్కడే ఉన్నానని, నలుగురు వ్యక్తులు అక్కడికి వచ్చి, లోహపు దిమ్మెను విడొగొట్టి, చక్రాల బండిలో వేసుకుని వెళ్లారని, ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలను తాను ఫొటో తీశానని తెలిపారు. వారంతా రాత్రిపూట పనిచేసేందుకు వీలుగా హెడ్ ల్యాంప్స్ ధరించి వున్నారని రోస్ బెర్నార్డ్ వెల్లడించారు. వారిలో ఒకరు తమను చూశాడని కూడా తెలిపారు.

కాగా, ఆపై మంగళవారం నాడు 34 సంవత్సరాల అడ్వెంచర్ స్పోర్ట్స్ మెన్ ఆండీ లూయిస్ ఓ యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేస్తూ, "మేము ఉటా లోహపు దిమ్మెను తొలగించాం" అన్న టైటిల్ తో వీడియోను విడుదల చేశాడు. ఆ వెంటనే రోస్ బెర్నార్డ్ తన వద్ద ఉన్న చిత్రాలను బహిర్గతం చేయడం గమనార్హం. ఇక ఇదే తరహా దిమ్మె రొమేనియాకు ఎలా చేరింది? అక్కెడెలా కనిపిస్తోందన్న విషయమై మరింత సమాచారం వెలువడాల్సి వుంది. 



More Telugu News