సచిన్ మరో రికార్డును అధిగమించిన విరాట్ కోహ్లీ!

  • నేడు ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డే
  • అతి తక్కువ ఇన్నింగ్స్ లో 12 వేల పరుగుల రికార్డు
  • 242వ ఇన్నింగ్స్ లోనే సాధించిన కోహ్లీ
  • 300 ఇన్నింగ్స్ లు తీసుకున్న సచిన్
నేడు కాన్ బెర్రాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరు వన్డేలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, మరో అరుదైన రికార్డును సాధించాడు. ఇప్పటి సచిన్ సాధించిన రికార్డుల్లో ఎన్నింటినో అధిగమించిన కోహ్లీ, ఈ దఫా, అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ గేమ్ ప్రారంభానికి ముందు 11,977 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ, మరో 33 పరుగులు సాధించడం ద్వారా ఈ మైలురాయిని చేరుకోగా, అందుకు 242 వన్డే ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది.

ఇక గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేదన్న సంగతి తెలిసిందే. సచిన్ తన 300వ ఇన్నింగ్స్ లో 12 వేల పరుగుల మైలురాయిని తాకాడు. మొత్తం 463 ఇన్నింగ్స్ ఆడిన సచిన్, తన ఖాతాలో 18,426 పరుగులను వేసుకోగా, ఆ రికార్డును కూడా కోహ్లీ అధిగమించే అవకాశాలు ఉన్నాయని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.

తన 205వ ఇన్నింగ్స్ లో 10 వేల పరుగుల మైలురాయిని తాకిన కోహ్లీ, ఆపై 17 ఇన్నింగ్స్ లలోనే మరో 1000 పరుగులు చేశాడు. దాని తరువాత మరో 1000 పరుగులకు 22 ఇన్నింగ్స్ లను తీసుకున్నాడు. ఇదే ఊపుతో కొనసాగితే, మరో 150 ఇన్నింగ్స్ లలోనే సచిన్ చేసిన పరుగులను కోహ్లీ దాటే వీలుంటుంది.


More Telugu News