రైతు ఉద్యమాన్ని క్రూరంగా అణచివేయాలనుకోవడం సరికాదు: ఏఐఐఈఏ

  • రైతు ఉద్యమానికి క్రమంగా పెరుగుతున్న మద్దతు
  • కనీస మద్దతు ధర పొందడాన్ని న్యాయపరమైన హక్కును చేయాలి
  • రైతుల అణచివేతతో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ప్రతిపక్షాలు పూర్తిగా రైతుల పక్షం వహించగా, అధికార పక్షంలోని కొన్ని పార్టీలు కూడా కర్షకులకు మద్దతుగా గళం విప్పుతున్నాయి. తాజాగా, అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం (ఏఐఐఈఏ) రైతు ఉద్యమానికి సంఘీభావం ప్రకటించింది. రైతులు తమ పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పొందడాన్ని న్యాయపరమైన హక్కును చేయాలని డిమాండ్ చేసింది.

ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన రైతులు చేపట్టిన ఉద్యమాన్ని క్రూరంగా అణచివేయాలని చూస్తుండడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారని, వారిని అణచివేస్తే దేశంలో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడంతోపాటు ఇతర జాతీయ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని ఏఐఐఈఏ ఆవేదన వ్యక్తం చేసింది.


More Telugu News