భారత అంతర్గత విషయాలపై స్పందించడం సబబు కాదు: కెనడా ప్రధాని వ్యాఖ్యలపై కేంద్రం

  • ఢిల్లీలో రైతుల నిరసనలపై స్పందించిన కెనడా ప్రధాని
  • శాంతియుత నిరసనలకు మద్దతిస్తామని వ్యాఖ్యలు
  • అది భారత అంతర్గత వ్యవహారమన్న విదేశాంగ శాఖ
శాంతియుతంగా జరిపే నిరసనలకు తమ మద్దతు ఉంటుందని, ఢిల్లీలో రైతులు జరుపుతున్న నిరసనలు ఆందోళన కలిగిస్తున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై భారత ప్రభుత్వంతో కూడా మాట్లాడామని ఆయన చెప్పారు. పరోక్షంగా రైతులకు తాము మద్దతు ఇస్తున్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్ లోని పలు వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. రైతుల సమస్య భారత్ అంతర్గత విషయం కాగా, ఓ దేశాధినేత దీనిపై స్పందించడం మీడియాలో ప్రముఖ వార్తాంశమైంది.

దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కెనడాకు చెందిన కొందరు నేతలు సరైన సమాచారం లేకుండా భారత్ లోని రైతు నిరసనలపై స్పందిస్తున్నారని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అయితే భారత అంతర్గత విషయాలపై ఆ నేతలు స్పందించడం సబబు కాదని స్పష్టం చేశారు. దౌత్య పరమైన అంశాలపై చేసిన వ్యాఖ్యలకు రాజకీయ అవసరాల కోసం తప్పుడు నిర్వచనాలు ఇవ్వడం సరైన పద్ధతి అనిపించుకోదు అని శ్రీవాత్సవ హితవు పలికారు.


More Telugu News