గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.. ప్రజలందరూ నిర్భయంగా ఓటేయండి: డీజీపీ మహేందర్ రెడ్డి

  • కరోనా నిబంధనలను‌ పాటిస్తూ ఓట్లు వేస్తోన్న ఓటర్లు 
  • పలు చోట్ల ఓట్లు గల్లంతయ్యాయంటూ ఫిర్యాదులు
  • ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారు
  • జియాగూడలో స్థానిక ఓటర్ల ఆందోళన
గ్రేటర్ హైదరాబాద్‌ మహానగర్ పాలక మండలి ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కరోనా నిబంధనలను ‌ పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే, పలు చోట్ల ఓట్లు గల్లంతయ్యాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. మలక్ పేట, చంద్రాయణగుట్టలోని ఇంద్రానగర్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  

ఓల్డ్‌ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఎం పార్టీ గుర్తు ముద్రించారు. దీంతో‌ పోలింగ్‌ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. బ్యాలెట్‌ పత్రంలో కంకి కొడవలి గుర్తుకు బదులు సుత్తి కొడవలి ఉందని తెలిపింది. అలాగే, జియాగూడ స్థానిక ఓటర్లు ఆందోళనకు దిగారు.

పోలింగ్ సెంటర్ 38లో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించారని అన్నారు. బంజారాహిల్స్‌ ఎన్జీటీనగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద బీజేపీ కార్యకర్తలు కాషాయ మాస్కులు ధరించారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అలాగే, టీఆర్ఎస్ కార్యకర్తలు చేతులకు గులాబీ కంకణాలు కట్టుకున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇరుపార్టీల వారినీ పోలీసులు చెదరగొట్టారు.  

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికలపై డీజీపీ మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్నికల కోసం పోలీసు శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు.


More Telugu News