ఆన్ లైన్ కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ లు ఇక వద్దు: నిర్మలా సీతారామన్ కు వాణిజ్య సంఘాల లేఖ!

  • చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది
  • నేరుగా ట్రేడర్ల నుంచి కొన్న వారు నష్టపోతున్నారు
  • ఆర్బీఐ పారదర్శకత దెబ్బతింటోంది
  • ఆర్థికమంత్రికి రాసిన లేఖలో సీఏఐటీ
ఆన్ లైన్ కొనుగోళ్లు జరిపిన సమయంలో బ్యాంకులు ఆఫర్ చేస్తున్న క్యాష్ బ్యాక్ లను నిలిపివేయాలని సీఏఐటీ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో డిమాండ్ చేసింది. ఈ కామర్స్ సంస్థలు, బ్యాంకులు కలిసిపోయి కస్టమర్లకు ఇన్సెంటివ్ లు ఇస్తున్నాయని, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పారదర్శకతను దెబ్బ తీస్తోందని వాణిజ్య సంఘాలు ఆరోపించాయి.

"ప్రస్తుతం ఇండియాలో అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్, సిటీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్ఎస్బీసీ, ఆర్బీఎల్ తదితర బ్యాంకులు ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలతో డీల్స్ కుదుర్చుకుని,10 శాతం వరకూ క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తున్నాయి. తమ బ్యాంకు కార్డులను ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా వాడుకుని వీటిని పొందవచ్చని బ్యాంకులే స్వయంగా ప్రచారం చేస్తున్నాయి" అని ఈ లేఖలో సీఏఐటీ జాతీయ కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఆరోపించారు.

ఇక ఇవే బ్యాంకులు ట్రేడర్ల నుంచి నేరుగా వస్తువులను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, ఆన్ లైన్ లో చెల్లింపులు జరుపుతున్నా ప్రోత్సాహకాలను ఇవ్వడం లేదని ఆరోపించిన ఆయన, ఫలితంగా చిన్న, మధ్య తరహా వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా వాణిజ్య హక్కుకు విఘాతం కలుగుతోందని, 2002 నాటి కాంపిటీషన్ చట్టాన్ని పట్టించుకోకుండా బ్యాంకులు ఆఫర్లను ఇస్తున్నాయని ప్రవీణ్ ఆరోపించారు.

ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకుని, ఆన్ లైన్ కొనుగోళ్లపై డిస్కౌంట్లు ఇస్తున్న బ్యాంకులను విచారించాలని సీఏఐటీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో బ్యాంకులను ఇంతవరకూ రిజర్వ్ బ్యాంక్ కూడా ప్రశ్నించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని తమ లేఖలో వారు తెలియజేశారు. ఇదిలావుండగా, ఇటీవల సీఏఐటీ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఓ లేఖ రాస్తూ, ఆన్ లైన్ కొనుగోళ్లు, డిస్కౌంట్లను నియంత్రించేందుకు సాధికార నియంత్రణా కమిటీని నియమించాలని కోరడం జరిగింది.


More Telugu News