ముందుగా టీకా మాకే... వలంటీర్లుగా గుంటూరు ఆసుపత్రికి క్యూ కడుతున్న వ్యాపారవేత్తలు, ఐఏఎస్ అధికారులు, టెక్కీలు!

  • గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ట్రయల్స్
  • 1000 మందికి రెండు డోస్ ల టీకా
  • ఖరీదైన కార్లలో వస్తున్న వలంటీర్లు
  • వ్యాక్సిన్ పనిచేస్తుందన్న వార్తలతోనే
గుంటూరు ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రికి ఇప్పుడు బడాబాబులు క్యూ కడుతున్నారు. ఐఏఎస్ అధికారులతో పాటు వ్యాపారవేత్తలు, టెక్కీలు, ప్రజా ప్రతినిధులు వచ్చి, కోవాగ్జిన్ టీకా వలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు ఈ వ్యాక్సిన్ ను తయారు చేయగా, గురువారం నుంచి గుంటూరులో మూడవ దశ ట్రయల్స్ మొదలయ్యాయి.

మొత్తం 1000 మందికి టీకాను ఇవ్వాలని నిర్ణయించగా, తొలి మూడు రోజుల్లోనే 150 మంది వలంటీర్లుగా నమోదు చేయించుకుని టీకా తీసుకున్నారు. వీరిలో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, బిజినెస్ మెన్, ఐటీ ఇంజనీర్లతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులు కూడా ఉండటం గమనార్హం.

ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దుష్ప్రభావాలు ఉండవని అత్యధికులు భావిస్తుండటమే వ్యాక్సిన్ ట్రయల్స్ కు భారీ స్పందన రావడానికి కారణమని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక, వలంటీర్ గా పేర్లు నమోదు చేయించుకున్నవారికి తొలిరోజున 0.5 ఎంఎల్ వాక్సిన్ నరాల్లోకి ఇస్తున్నారు. ఆపై 28వ రోజున వేసే రెండో డోస్ అనంతరం, 60వ రోజున శరీరంలో యాండీ బాడీల పెరుగుదలను వైద్యులు పరిశీలిస్తారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశిత ప్రమాణంలో యాంటీ బాడీలు, రోగ నిరోధక శక్తి పెరిగితే, వ్యాక్సిన్ చక్కగా పనిచేస్తున్నట్టు గుర్తిస్తారు.


More Telugu News