తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటన షెడ్యూల్ ఖరారు

  • డిసెంబరు 2 నుంచి 5వ తేదీ వరకు పర్యటన
  • కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటన
  • పంట పొలాలను పరిశీలించనున్న జనసేనాని
కొన్నిరోజుల కిందట వచ్చిన నివర్ తుపాను ఏపీ రైతులను దారుణంగా దెబ్బతీసింది. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా అన్ని జిల్లాలపైనా నివర్ పంజా విసిరింది. ఈ నేపథ్యంలో, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. పవన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను జనసేన పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేసింది. డిసెంబరు 2న పవన్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారు. అనంతరం 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలిస్తారు.

డిసెంబరు 2 ఉదయం 9.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి పవన్ పర్యటన ప్రారంభం కానుంది. పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించి, అక్కడి రైతులతో మాట్లాడతారు. పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాలో ప్రవేశించి భట్టిప్రోలు, చావలి, పెరవలి, తెనాలి, నందివెలుగు, కొలకలూరు ప్రాంతాల్లో పర్యటిస్తారు.

డిసెంబరు 3న చిత్తూరు జిల్లా తిరుపతి చేరుకుంటారు. అదే రోజున తిరుపతిలో జనసేన నాయకులతో సమావేశమై చిత్తూరు జిల్లాలో నివర్ తుపాను నష్టంపై చర్చిస్తారు. డిసెంబరు 4న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడతారు. అనంతరం నాయుడుపేట, గూడూరు ప్రాంతాల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారని జనసేన తన ప్రకటనలో వెల్లడించింది.

డిసెంబరు 5న నెల్లూరు, రావూరు, వెంకటగిరి ప్రాంతాల్లో తుపాను నష్టాన్ని పరిశీలిస్తారు. స్వయంగా రైతుల కడగండ్లను తెలుసుకోనున్నారు.


More Telugu News