అసెంబ్లీలో స్పీకర్ పోడియం ముందు బైఠాయించిన చంద్రబాబు.. సభ నుంచి సస్పెన్షన్

  • తుపాను పంట నష్టంపై చర్చ సందర్భంగా ఊహించని ఘటన
  • అధికారపక్షం తీరుపై చంద్రబాబు నిరసన
  • సభ నుంచి టీడీపీ సభ్యులందరినీ సస్పెండ్ చేసిన స్పీకర్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో పోడియం ముందు కూర్చుని, నిరసన వ్యక్తం చేశారు. శాసనసభలో తుపాను పంట నష్టంపై చర్చ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది.

ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు మాట్లాడేందుకు యత్నించగా అధికారపక్షం అడ్డుకుంది. అధికారపక్షం తీరును నిరసిస్తూ చంద్రబాబు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. ఈ నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ సభలో చంద్రబాబు రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. వయసుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించాలని అన్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటు 12 మంది టీడీపీ సభ్యులను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెన్షన్ కు గురైన వారిలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, గద్దె రామ్మోహన్‌, జోగేశ్వరరావు, సత్యప్రసాద్‌, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్‌ ఉన్నారు.


More Telugu News