అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకోనున్న ర‌జ‌నీకాంత్.. అభిమానులతో కీలక భేటీ

  • చెన్నైలోని ఫంక్షన్ హాల్ లో సమావేశం 
  • అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం
  • #RajinikanthPoliticalEntry హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానుల పోస్టులు
త‌న అభిమాన సంఘాలకు చెందిన అధ్యక్షుల‌ందరూ ఈ రోజు చెన్నైకు రావాలని సినీనటుడు రజనీకాంత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు వారితో సమావేశమై రజనీ మాట్లాడుతున్నారు. చెన్నైలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఆర్‌ఎంఎం(రజనీ మక్కళ్‌ మండ్రం) నిర్వాహకులతో రజనీకాంత్‌ తన కొత్త పార్టీ ఏర్పాటు, ప్రచారంపై సమావేశం జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఆయన కీలక చర్చలు జరుపుతారని ప్రచారం జరుగుతోంది. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచించుకుంటుండగా రజనీ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం.

ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని అభిమానులు చాలా సార్లు ఆయన ఇంటి వద్దకు వచ్చి నినాదాలు చేశారు. దీనిపై రజనీ మాత్రం ఇన్నాళ్లూ మౌనం వహిస్తూ వచ్చారు. అందుకే, రాజకీయ అరంగేట్రం గురించి చర్చించడానికే ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది.

ఆయన పుట్టినరోజు (డిసెంబరు 12)న రాజకీయ పార్టీ, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికపై ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులు అంటున్నారు.  సామాజిక మాధ్యమాల్లో #RajinikanthPoliticalEntry అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులు పోస్టులు చేస్తున్నారు.  


More Telugu News