ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం... బయటి వ్యక్తులు వెళ్లిపోవాలన్న ఎస్ఈసీ

  • 15 రోజుల ప్రచారానికి నేటి సాయంత్రంతో తెర
  • గడువు తర్వాత ప్రచారం చేస్తే జైలుశిక్ష
  • డిసెంబరు 1న పోలింగ్
గత కొన్నిరోజులుగా రణరంగాన్ని తలపించేలా సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది. 15 రోజులుగా హోరాహోరీగా సాగించిన ప్రచారానికి పార్టీలు ముగింపు పలికాయి. కాగా, గడువు తర్వాత కూడా ప్రచారం చేస్తే రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించనున్నారు. బయటి వ్యక్తులు జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్లిపోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ నుంచి ప్రకటన వెలువడింది. ఈ ప్రకటనతో గ్రేటర్ వార్ లో ప్రచార ఘట్టానికి తెరపడింది.

అభివృద్ధి, ఇటీవల వచ్చిన వరదలు, బాధితులకు సాయం, నాలా కబ్జాలు, ఆక్రమణలు వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఆయా పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం చేశాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య మైత్రి సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోగా, దీన్ని బీజేపీ ఎలా సొమ్ము చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ డిసెంబరు 1న జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. డిసెంబరు 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది.


More Telugu News