అక్కడ లేని అభ్యంతరం ఇక్కడెందుకు?: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి లేఖ రాసిన చంద్రబాబు

  • త్వరలో శీతాకాల సభా సమావేశాలు
  • అసెంబ్లీలో మీడియా పాయింట్ తొలగించడమేంటన్న చంద్రబాబు
  • మీడియాను నిషేధించడం అప్రజాస్వామ్యం అని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు. శాసనసభ శీతాకాల సమావేశాలకు మీడియాను అనుమతించకుండా, అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ ను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడాన్ని తాము ఖండిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగస్వామి అని, అలాంటి మీడియాను నిషేధించడం అప్రజాస్వామ్య చర్య అని విమర్శించారు.

గతంలో మీడియా హక్కులను హరించేలా జీవో 2430 జారీ చేస్తే రాష్ట్రంలోనూ, దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ప్రెస్ కౌన్సిల్ కూడా ఆ జీవోపై అభ్యంతరం వ్యక్తం చేసిందని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు చట్టసభల్లోకి మీడియా ప్రవేశాన్ని నిరోధించడం అంతకంటే దారుణమైన చర్య అని అభివర్ణించారు. ఇటీవల పార్లమెంటు సమావేశాలకు మీడియాను అనుమతించారని, అక్కడలేని నిషేధం ఇక్కడెందుకని ప్రశ్నించారు.

చట్ట సభల్లో ఏంజరుగుతోందో ప్రజలకు తెలియకుండా ఉండేందుకు మీడియాను నిషేధించడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. చట్టసభల ప్రత్యక్ష ప్రసార అవకాశాన్ని తరతమ భేదాలు లేకుండా అన్ని మీడియా సంస్థలకు అందించాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని చంద్రబాబు స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.


More Telugu News