శత్రుపక్షం మిత్రపక్షంగా మారితే.. మిత్రపక్షం శత్రుపక్షమైంది: ‘మహా’ మంత్రి ఆదిత్య థాకరే
- బీజేపీ ఇలా ప్రవర్తిస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు
- అభివృద్ది చేస్తూ ముందుకు సాగుతాం
- ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ పగటి కలలు కంటోంది
మహారాష్ట్రలోని ప్రతిపక్ష బీజేపీపై అధికార శివసేన పార్టీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మిత్రపక్షమనుకున్న బీజేపీ తమ శత్రుపక్షంగా మారిందని మంత్రి ఆదిత్య థాకరే అన్నారు. తాము మిత్రులుగా భావిస్తున్న వారు ఇలా వ్యక్తిగత విమర్శలతో దాడిచేస్తారని తామెప్పుడూ అనుకోలేదన్నారు. తాము మాత్రం ఎప్పుడూ అలాంటి విమర్శలు చేయలేదని పేర్కొన్నారు. తామెప్పుడూ ఎవరినీ శత్రువులుగా భావించలేదని, అలాగే, ఎవరిపైనా వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోలేదన్నారు.
తమ మిత్ర పక్షంగా ఉంటుందనుకున్న బీజేపీ శత్రుపక్షమైందని, శత్రుపక్షం అనుకున్న వారు ఇప్పుడు తమతో కలిసి రాష్ట్ర అభివృద్దిలో పాలుపంచుకుంటున్నారని ఆదిత్య థాకరే అన్నారు. ఈ కొత్త సమీకరణాలతోనే ముందుకు సాగుతూ అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
తమ సంకీర్ణ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుందని బీజేపీ పగటి కలలు కంటోందని మంత్రి ఎద్దేవా చేశారు. వారు అలాగే కలలు కంటూ ఉంటారని, తాము మాత్రం పూర్తికాలం అధికారంలో ఉంటామని ఆదిత్య థాకరే ధీమా వ్యక్తం చేశారు.