తమిళనాడులో 10వ శతాబ్దానికి చెందిన వర్ధమాన మహావీరుడి విగ్రహం లభ్యం

  • దట్టమైన అడవుల్లో విగ్రహం
  • సగం వరకు మట్టిలో కూరుకుపోయిన వైనం
  • విగ్రహం పురాతనమైనదని తేల్చిన నిపుణులు
భారతదేశంలో జైన మతాన్ని పునరుద్ధరించిన 24వ, చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. కాగా, 10వ శతాబ్దం నాటి మహావీరుడి విగ్రహం తాజాగా తమిళనాడులో వెలుగుచూసింది. తిరువణ్ణామలై జిల్లా పోలూరు వద్ద దట్టమైన అటవీప్రాంతంలో ఈ విగ్రహం లభ్యమైంది. కె.జీవన్ కుమార్ అనే జైన మతగురువు ఈ విగ్రహాన్ని గుర్తించారు. మట్టితో సగం కప్పివేసిన స్థితిలో ఉన్న ఈ విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉంది.

స్థానికులు ఈ విగ్రహాన్ని బుద్ధ ప్రతిమ అనుకున్నారు. దీన్ని పరిశీలించిన నిపుణులు తమిళ జైనులు విలసిల్లిన కాలం నాటిదని వెల్లడించారు. విగ్రహ నిర్మాణ శైలి, శిల్పకళ మొదలైన అంశాల ఆధారంగా అది 10వ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు. కాగా, ఈ విగ్రహం లభ్యమైన విషయాన్ని జీవన్ కుమార్ జైన మఠానికి తెలియజేశారు. ఈ మహావీర విగ్రహాన్ని సంరక్షించేందుకు అక్కడ ఓ నిర్మాణం చేపట్టనున్నారు.


More Telugu News