నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: జనసేన నేతల డిమాండ్

  • ఢిల్లీలోనీ బీజేపీ నేతలు కోరితేనే గ్రేటర్‌లో జనసేన పోటీ చేయట్లేదు
  • ఇవేవీ తెలుసుకోకుండా అరవింద్ మాట్లాడం సబబుకాదు
  • ఒక్క ఓటు కూడా చీలకూడదనే సదుద్దేశంతో  మా నిర్ణయం
  • కావాలంటే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండి
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సొంతంగా నిర్ణయం తీసుకుని పోటీ నుంచి తప్పుకుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన అభ్యంతరాలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోనీ బీజేపీ అగ్ర నేతలు, తెలంగాణ రాష్ట్ర నేతలు కోరితేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి  జనసేన పార్టీ తప్పుకుందని, బీజేపీకి మద్దతు ఇచ్చిందని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు. ఇవేవీ తెలుసుకోకుండా అరవింద్ మాట్లాడం సబబు కాదన్నారు.

ఈ విషయంలో జనసేన పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఒక్క ఓటు కూడా చీలకూడదనే సదుద్దేశంతో తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ నుంచి విరమించుకున్నారని చెప్పారు.

పవన్ నిర్ణయంతో అప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులు కొంత మేర నిరుత్సాహానికి లోనైనా అధ్యక్షుడి మాట శిరోధార్యంగా భావించి పోటీ నుంచి తప్పుకొన్నారని చెప్పారు. జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చిందో మీకు తెలియకపోతే మీ అగ్రనాయకులను అడిగి తెలుసుకోండని చెప్పారు. అరవింద్ జనసైనికులను రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సరైన పద్ధతి కాదని విమర్శించారు.


More Telugu News