ఆన్‌లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలు.. తీర్చలేక హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య

  • ఆన్‌లైన్ గేమ్స్ ఆడి రూ. 12 లక్షల అప్పుల పాలు
  • విషయం తెలిసి తీర్చేసిన తండ్రి
  • ఆ తర్వాత కూడా మరో 12 లక్షల అప్పులు
  • ఆత్మహత్యకు ముందు క్షమించాలంటూ సెల్ఫీ వీడియో
ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం మరో యువకుడిని బలితీసుకుంది. ఆన్‌లైన్‌లో గేమ్స్  ఆడి అప్పులపాలైన యువకుడు తీవ్ర మనస్తాపంతో  ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తనను క్షమించాలని, తన పిల్లలను చూసుకోవాలంటూ తండ్రిని ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో పనిచేస్తున్న ఆళ్ల జగదీశ్ (33)కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న దురాశతో ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలో రూ. 12 లక్షల  వరకు అప్పులపాలయ్యాడు.

కుమారుడి అప్పుల గురించి తెలిసిన తండ్రి  వీరభద్రయ్య ఆ అప్పులన్నింటినీ తీర్చేశాడు. అయితే, నష్టపోయిన రూ. 12 లక్షలను తిరిగి సంపాదించాలన్న ఉద్దేశంతో జగదీశ్ మళ్లీ ఆన్‌లైన్ గేములనే ఎంచుకున్నాడు. ఈసారి కూడా మరో రూ. 12 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జగదీశ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తండ్రిని ఉద్దేశించి ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తల్లిదండ్రులను, భార్యాపిల్లలను మోసం చేశానని అందులో వాపోయాడు. పిల్లల కోసం ఏమీ చేయలేకపోయానని, తనను క్షమించాలని వేడుకున్నాడు. పిల్లలను బాగా చూసుకోవాలని తండ్రిని కోరాడు. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News