బాలీవుడ్ కి 'మిథునం'.. బాలు పోషించిన పాత్రలో అమితాబ్!

  • ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన 'మిథునం'
  • పాత్రలలో జీవించిన బాలు, లక్ష్మి జంట  
  • రీమేక్ హక్కులు తీసుకున్న ప్రముఖ సంస్థ
  • అమితాబ్, రేఖ కలసి నటించే అవకాశం
ఎనిమిదేళ్ల క్రితం తెలుగులో వచ్చిన 'మిథునం' చిత్రం ఒక సంచలనం.. ఒక ప్రయోగం. కేవలం రెండే రెండు పాత్రలతో నడిచే సినిమా మనల్ని అలా కట్టిపారేస్తుంది. ప్రముఖ రచయిత శ్రీరమణ మూలకథతో.. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశ్రాంత ఉపాధ్యాయుడు అప్పదాసు పాత్రలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, అతని భార్య బుచ్చి లక్ష్మి పాత్రలో సీనియర్ నటి లక్ష్మి తమ పాత్రల్లో జీవించారు.

రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలు ఎక్కడో విదేశాలలో వుంటారు. వయసు మీదపడి వృద్ధాప్యంలో ఈ జంట సొంత ఊరులో తమ శేషజీవితాన్ని ఆడుతూ పాడుతూ అనుభూతుల, అనుభవాల సమ్మేళనంగా ఎంత అందంగా గడిపారన్నది వెండితెరపై రమణీయంగా ఆవిష్కృతమైన తీరు ప్రేక్షకుల హృదయాలను గాఢంగా హత్తుకుంది. బాలు, లక్ష్మిల అభినయంకు ప్రేక్షకులు హ్యాట్సాప్ చెప్పారు.

ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుందట. హిందీలో దీనిని అమితాబ్ బచ్చన్, రేఖ జంటతో రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఒకనాటి హిట్ కాంబినేషన్ అయిన ఈ జంట ఇందులో నటిస్తే కనుక అభిమానులకు ఇదొక అందమైన కానుక అవుతుందనే చెప్పచ్చు.


More Telugu News