అశ్రునయనాలతో మారడోనాకు వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు... శోకసంద్రంలో అర్జెంటీనా!

  • బ్యూనస్ ఎయిర్స్ శివార్లలో ఖననం
  • తుది నివాళి కోసం వచ్చిన లక్షలాది మంది
  • అదుపు చేసేందుకు అభిమానులపై రబ్బర్ బులెట్లు
అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం, బుధవారం రాత్రి అనారోగ్యం కారణంగా కన్నుమూసిన డిగో మారడోనా అంత్యక్రియలు ప్రజలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఆయన పార్ధివ దేహాన్ని రాజధాని బ్యూనస్ ఎయిర్స్ శివార్లలోని బెల్లా విస్తా శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబీకులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నప్పటికీ, అంతకు ముందు జరిగిన అంతిమ యాత్రలో లక్షలాది మంది పాల్గొని తమ అభిమాన ఆటగాడికి శ్రద్ధాంజలి ఘటించారు.

అర్జెంటీనా జాతి మనసులో మారడోనాకు ఎన్నడూ మరణం లేదని, ఆయన ఎప్పటికీ దేశ ప్రజల మనసులలో చిరంజీవిగా ఉంటారని పలువురు వ్యాఖ్యానించారు. దేశానికే గర్వకారణంగా నిలిచిన అటువంటి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరమని, తరతరాలకు ఆయన గుర్తుండిపోతాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, మారడోనా అంతిమ యాత్రలో కొంత అపశ్రుతి చోటు చేసుకుంది. అభిమానులు పెద్దఎత్తున తరలిరావడం, తమ ఆటగాడిని చివరి సారిగా చూడాల్సిందేనని పట్టుబట్టడంతో, వారిని అదుపు చేసేందుకు పోలీసులు రబ్బర్ బులెట్లు, టియర్ గ్యాస్ లను ప్రయోగించాల్సి వచ్చింది. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో మారడోనా భౌతికదేహంపై జాతీయ పతాకాన్ని కప్పి ఉంచిన సమయంలో ప్రజల్లో భావోద్వేగాలు వెల్లువెత్తాయి.

సెక్యూరిటీ ఇబ్బందులు, కరోనా కారణంగానే అభిమానులందరికీ ఆయన ఆఖరి చూపులు దక్కలేదని అధికారులు వివరణ ఇచ్చారు. అప్పటికీ వేలాది మంది ఆయనకు తుది నివాళులు అర్పించారని అన్నారు. క్షణక్షణానికీ అభిమానుల తాకిడి పెరుగుతూ ఉండటంతోనే కొంత ఉద్రిక్తత ఏర్పడిందని అన్నారు.


More Telugu News