ఇక నుంచి స్థానిక భాషల్లోనే ఇంజనీరింగ్ కోర్సులు.. కేంద్రం నిర్ణయం!

  • వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు
  • పెదవి విరుస్తున్న విద్యావేత్తలు
  • మాతృభాషలో సాంకేతిక విద్యాబోధన కష్టమని పెదవి విరుపు
సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది శుభవార్తే. వచ్చే విద్యాసంవత్సరం నుంచి టెక్నికల్ కోర్సులను స్థానిక భాషల్లోనే నేర్చుకునే వీలు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సులతోపాటు టెక్నికల్ కోర్సులను మాతృభాషల్లోనే నేర్చుకునే వీలు కల్పిస్తున్నట్టు చెప్పిన మంత్రి, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. మాతృభాషలోనే టెక్నికల్ కోర్సులు అందించేందుకు ఐఐటీ, ఎన్ఐటీలను ఎంపిక చేయనున్నట్టు చెప్పారు.

అయితే, ఈ నిర్ణయం పట్ల విద్యావేత్తలు పెదవి విరుస్తున్నారు. సాంకేతిక పదబంధాలు ఎక్కువగా ఉండే టెక్నికల్ కోర్సులను మాతృభాషల్లో బోధించడం కష్టతరమైన పనేనని అంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తీసుకురావడం కష్టమైన పనేనని పేర్కొన్నారు. మాతృభాషలో టెక్నికల్ కోర్సులను అందించాలంటే అందుకు తగిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను రూపొందించడంతోపాటు, బోధనా సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.


More Telugu News