పీవీ ఘాట్‌కు బండి సంజయ్.. కేసీఆర్, అక్బరుద్దీన్‌‌లపై ఆగ్రహం

  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుమరుగు కాబోతుంది
  • ఎన్టీఆర్ కాలిగోటికి సరిపోదు ఎంఐఎం పార్టీ
  • అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి
  • ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేటీఆర్.. డ్రామారావు అయ్యారు
హైదరాబాద్‌ను వరద ముంచెత్తిన నేపథ్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని అంటోన్న టీఆర్ఎస్ సర్కారు.. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావుల ఘాట్ లను కూడా కూల్చివేయాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సీరియస్ అయిన బీజేపీ కూడా అంతే స్థాయిలో జవాబు చెప్పింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాసేపటి క్రితం పీవీ ఘాట్‌కు వెళ్లారు. ఆయన సందర్శనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పినప్పటికీ ఆయన అక్కడకు వెళ్లి పీవీకి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లేముందు మీడియాతో మాట్లాడుతూ అక్బరుద్దీన్‌పై విమర్శలు గుప్పించారు.

ఎన్టీఆర్ కాలిగోటికి ఎంఐఎం పార్టీ సరిపోదని బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కనుమరుగు కాబోతుందని అన్నారు. పీవీ, ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే ప్రభుత్వం అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించాలని.. వెంటనే కేసీఆర్ దీనిపై మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. తన అభిమాన నాయకుడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పటకీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని ఆయన నిలదీశారు. 

ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కేటీఆర్.. డ్రామారావు అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. మత విద్వేషాల కుట్రలపై పక్కా సమాచారం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన నిలదీశారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని బండి సంజయ్ అన్నారు. ఏపీ బీజేపీతో కలిసి తాము కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌పై అక్బరుద్దీన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే టీడీపీ స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉంటోందని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే తప్పేం లేదు కదా? అని నిలదీశారు. 


More Telugu News