అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనా కన్నుమూత

  • గుండెపోటుకు గురైన మారడోనా
  • ఇటీవలే మారడోనాకు శస్త్రచికిత్స
  • అర్జెంటీనాకు వరల్డ్ కప్ అందించిన దిగ్గజం
అర్జెంటీనా సాకర్ మాంత్రికుడు డీగో మారడోనా ఇక లేరు. తన అపురూప విన్యాసాలతో ఫుట్ బాల్ క్రీడకే వన్నె తెచ్చిన అరుదైన క్రీడాకారుల్లో ఒకరైన మారడోనా గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఇటీవలే మెదడులో రక్తస్రావం  జరగడంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కొన్ని వారాల కిందట ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. కోలుకుంటున్న దశలో అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు.

మారడోనా ఆటతోనే కాదు మాదకద్రవ్యాలు, ఇతర వివాదాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇటీవలే తన పుట్టినరోజు జరుపుకున్న ఈ ఫుట్ బాల్ లెజెండ్ ఇక లేరని తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1986లో అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర మారడోనాదే. ఇంగ్లాండ్ తో కీలక మ్యాచ్ లో హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ తో మారడోనా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గోల్ పోస్ట్ వద్ద మెరుపువేగంతో దూసుకెళ్లి, బంతిని గోల్ పోస్ట్ లోకి పంపినా, అది చేయి తగిలి గోల్ లోకి వచ్చిందని ప్రత్యర్థులు ఆరోపించగా, అది దేవుడి చేయి అయ్యుంటుందంటూ నాడు మారడోనా అందరినీ విస్మయానికి గురిచేశాడు.

1976లో అర్జెంటీనా జూనియర్ జట్టుకు ఆడిన మారడోనా ఆ తర్వాతి ఏడాదే సీనియర్ జట్టుకు ఎంపికై అంచెలంచెలుగా ఎదిగి కెప్టెన్ అయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ క్లబ్ జట్ల తరఫున 491 గేములు ఆడిన ఈ అర్జెంటీనా క్రీడాకారుడు 259 గోల్స్ చేశాడు. ఇక తన స్వదేశం అర్జెంటీనాకు 91 గేముల్లో ప్రాతినిధ్యం వహించి 34 గోల్స్ నమోదు చేశాడు.

మారడోనా 1984లో క్లాడియో విల్లాఫేన్ ను పెళ్లాడాడు. వీరికి దాల్మా నెరియా, గియానినా దినోరా అనే కుమార్తెలు ఉన్నారు. అయితే, మారడోనా, విల్లాఫేన్ 2004లో విడాకులు తీసుకున్నారు. కాగా, యువ ఫుట్ బాల్ ఆటగాడు డీగో సినాగ్రా తన కుమారుడే అని అప్పట్లో మారడోనా అంగీకరించడం ఓ సంచలనమైంది.


More Telugu News