పిల్లల్ని కొట్టకూడదు.. నేను చేసిన చిన్న పొరపాటు అదే: నాగబాబు

  • అన్ని విషయాలను చెప్పుకునే స్వేచ్ఛను పిల్లలకు కల్పించాలి
  • నాన్న దగ్గరకు వెళ్తే ఏం జరుగుతుందో అనే భయం పిల్లలకు ఉండరాదు
  • పిల్లలు సంతోషంగా ఉండటమే నాకు కావాలి
పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలనే విషయంపై సినీ నటుడు నాగబాబు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడారు. తమ భావాలను, చేసిన తప్పులను స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణాన్ని పిల్లలకు కల్పించాలని చెప్పారు. పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదని అన్నారు. వరుణ్, నిహారిక తప్పు చేసినప్పుడు తాను తిట్టేవాడినని... రెండు సార్లు కొట్టానని... తాను చేసిన పొరపాటు అదేనని చెప్పారు. తనకు అప్పట్లో పరిపక్వత లేకపోవడం వల్ల అలా చేశానని తెలిపారు.

తమ తల్లి పెద్దగా చదువుకోలేదని, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయం కూడా ఆమెకు తెలియదని నాగబాబు చెప్పారు. కానీ మాకు అన్నం పెట్టేటప్పుడు, కౌగిలించుకుని నిద్రపుచ్చే సమయంలో తన స్పర్శ ద్వారా ప్రేమను తెలిపేదని అన్నారు. ఈ విధంగా కమ్యునికేట్ చేయడానికి పెద్ద చదువులు అవసరం లేదని చెప్పారు.

వరుణ్, నిహారికలకు తాను ఎన్నో విషయాలను చెప్పేవాడినని, పాఠాలు కూడా బోధించేవాడినని, ఇతరులతో ఎలా ప్రవర్తించాలో వివరించేవాడినని నాగబాబు తెలిపారు. మీ భావాలను మాతో ధైర్యంగా పంచుకోండని పిల్లలిద్దరికీ ఎప్పుడో చెప్పానని... నాన్న దగ్గరకు వెళ్తే ఏం జరుగుతుందో అనే భయం పిల్లలకు ఉండకూడదని చెప్పారు. మీరు తప్పు చేసినా సరే తనతో చెప్పండని పిల్లలకు చెప్పానని తెలిపారు.

వరుణ్ డిగ్రీ ఫస్టియర్ చదివేటప్పుడు సినిమాల్లో నటిస్తానని చెప్పాడని, నిహారిక కూడా సినిమాల్లోకి వస్తానని చెప్పిందని... తాను వారికి ఓకే చెప్పానని నాగబాబు చెప్పారు. మంచి నటుడ్ని అవుతానని వరుణ్ తనకు చెప్పాడని... దానికి సమాధానంగా పెద్ద నటుడివి కాకపోతే జీవితం వేస్ట్ అనుకోవద్దని చెప్పానని... ఫలితం ఎలాగున్నా సంతోషంగా జీవించమని చెప్పానని అన్నారు. తాను చనిపోయిన తర్వాత కూడా అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తానని చెప్పానని తెలిపారు. పిల్లలు సంతోషంగా ఉండటమే తనకు కావాలని చెప్పారు. అనుకున్నది సాధించలేకపోయామనే నిరాశ పిల్లల్లో ఉండకూడదని అన్నారు.


More Telugu News