అసెంబ్లీలో టీఆర్ఎస్ ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో మాకు తెలుసు: కేటీఆర్ వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ ఫైర్

  • మేము అడుగేస్తే దుమ్ము లేస్తుంది
  • ఎవరి కింద బతకాల్సిన అవసరం మాకు లేదు
  • ఒవైసీ కనుసన్నల్లో ఓల్డ్ సిటీ నడుస్తుంది
మరో నాలుగు రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగియనున్న తరుణంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారపర్వం వాడీవేడిగా కొనసాగుతోంది. మొన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు... గ్రేటర్ ఎన్నికల్లో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

తాము తలచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేయగలమని ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా టీఆర్ఎస్ పై ఎంఐఎం నేత, శాసనసభలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల ఇళ్లను అక్రమ కట్టడాలు, కబ్జాల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చి వేస్తోందని అక్బర్ మండి పడ్డారు.

ప్రభుత్వానికి దమ్ముంటే హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ఘాట్లను కూల్చేయాలని సవాల్ విసిరారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడంలో టీఆర్ఎస్ విఫలమైందని చెప్పారు. ఎంఐఎంతో పొత్తు లేదని కేటీఆర్ అంటున్నారని... తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదని అన్నారు. తాము అడుగేస్తే దుమ్ము లేస్తుందని చెప్పారు. అసెంబ్లీలో తోకను తొక్కి టీఆర్ఎస్ ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో తమకు తెలుసని అన్నారు. తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కనుసన్నల్లోనే ఓల్డ్ సిటీ నడుస్తుందని చెప్పారు.


More Telugu News