రేపు, ఎల్లుండి హైదరాబాద్ లో భారీ వర్షాలు... ఐఎండీ హెచ్చరిక!

  • నేడు తీరాన్ని దాటనున్న నివర్
  • తమిళనాడు, రాయలసీమ మీదుగా ఏపీకి నివర్
  • తుపాను గమనాన్ని పరిశీలించాల్సి వుందన్న ఐఎండీ
రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని, నివర్ తుపాను తీరాన్ని దాటిన తరువాత ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణితో కలిసి తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు నివర్ తుపాను తమిళనాడు తీరాన్ని దాటుతూ, ఆపై రాయలసీమ, కర్ణాటకల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్న భారత వాతావరణ శాఖ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరంజ్ ఎలర్ట్ ను ప్రకటించింది.

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాల్లో 26వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని, 27న మిగతా చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ దక్షిణ, వాయవ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, ఈ విషయంలో పూర్తి అంచనాకు రావాలంటే, గురువారం నాడు తుపాను గమనాన్ని పరిశీలించాల్సి వుంటుందని హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు.

నివర్ తుపానుతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒకటి నుంచి మూడు డిగ్రీలకు పడిపోతాయని, ఈ ప్రభావం 29 వరకూ కొనసాగుతుందని పేర్కొన్న ఐఎండీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఐఎండీ నుంచి వచ్చిన సూచనలతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్ లు అలర్ట్ అయ్యాయి.


More Telugu News