బిగ్ బాస్ షోలో ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా నాకు ఓకే: నాగబాబు

  • అవినాశ్, అభిజిత్ పై నాగబాబు ప్రశంసలు
  • అవినాశ్ తనకు జబర్దస్త్ ద్వారా సన్నిహితుడయ్యాడని వెల్లడి
  • అభిజిత్ మనసు మంచిదన్న మెగాబ్రదర్
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా విజయవంతంగా నడుస్తోంది. కాగా, బిగ్ బాస్ షోపై మెగాబ్రదర్ నాగబాబు స్పందించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అవినాశ్, అభిజిత్ లపై  తన అభిప్రాయాలు వెల్లడించారు.

అవినాశ్ తనకు చాలాకాలంగా తెలుసని, జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అవినాశ్ తనకు ఎంతో సన్నిహితుడయ్యాడని నాగబాబు తెలిపారు. అయితే, బిగ్ బాస్ షోలో ఓసారి అవినాశ్ తీవ్ర భావోద్వేగాలకు గురికావడం గమనించానని, దాంతో అతడికి కొద్దిగా బ్యాడ్ నేమ్ వచ్చిందని అన్నారు. తనకు తెలిసినంత వరకు అవినాశ్ ఎమోషనల్ వ్యక్తి కాదని, బహుశా బిగ్ బాస్ షోలో పరిస్థితుల కారణంగా భావోద్వేగాలకు లోనై ఉంటాడని తెలిపారు.

ఇక, అభిజిత్ గురించి చెబుతూ ఎంతో నిరాడంబరమైన వ్యక్తి అని వెల్లడించారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన అభిజిత్ ను తాను ఒకట్రెండు సార్లు కలిశానని, మొదటిసారి కలిసినప్పుడే ఎంతో నచ్చాడని వివరించారు. ఎంతో మంచి కుర్రాడు అనిపించాడని, ఓ హీరోగా సక్సెస్ అయ్యుంటే బాగుండును అనిపించిందని, కానీ సినిమా కెరీర్ విషయం అటుంచితే బిగ్ బాస్ లో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పారు. అవినాశ్ తనకు బాగా క్లోజ్ అవడం వల్ల అతడ్ని సపోర్ట్ చేయమని చెబుతున్నాను కానీ, తన మనసంతా అభిజిత్ పైనే ఉందని, అతడికి కూడా తప్పకుండా మద్దతు ఇవ్వాలని అభిమానులను నాగబాబు కోరారు.

వీళ్లిద్దరికీ మద్దతు ఇవ్వమని తనకు ఎవరూ సూచించలేదని, ఎందుకో వారిద్దరి గురించి చెప్పాలనిపించిందని మెగాబ్రదర్ అన్నారు. ఒకరేమో నాకు బాగా సన్నిహితుడు, మరొకరేమో మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు కావడంతో ఈ మాట చెబుతున్నానని తెలిపారు. అవినాశ్, అభిజిత్ లను ఫైనల్స్ కు తీసుకెళ్లాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నానని, వారిద్దరిలో ఎవరు గెలిచినా తనకు సంతోషమేనని పేర్కొన్నారు.


More Telugu News