ధోనీ మార్గదర్శి దేవల్ సహాయ్ కన్నుమూత

  • కెరీర్ తొలినాళ్లలో సీసీఎల్ కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ
  • సీసీఎల్ డైరెక్టర్ గా వ్యవహరించిన సహాయ్
  • ధోనీ కోసం టర్ఫ్ పిచ్ లు ఏర్పాటుచేసిన వైనం
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో మార్గదర్శనం చేసిన దేవల్ సహాయ్ (దేబబ్రత్ సహాయ్) కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న దేవల్ సహాయ్ రాంచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కాగా, నెలరోజులకు పైగా చికిత్స పొందిన సహాయ్ గత నెలలో డిశ్చార్జి అయ్యారు. అయితే, ఆయన శరీరంలోని కీలక అవయవాలు పనిచేయకపోవడంతో మృత్యువాత పడ్డారు. మరోసారి ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనంలేకపోయింది.

దేవల్ సహాయ్ పాత్ర 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' బయోపిక్ లోనూ కనిపిస్తుంది. దేవల్ సహాయ్ గతంలో సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) డైరెక్టరుగా పనిచేశారు. ధోనీ కెరీర్ ప్రారంభ దశలో కోల్ ఫీల్డ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ధోనీలోని ప్రతిభను పసిగట్టిన ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించారు. అప్పటివరకు ఉన్న పిచ్ లకు భిన్నంగా ధోనీ కోసం ప్రత్యేకంగా టర్ఫ్ (పచ్చికతో కూడిన) పిచ్ లు అందుబాటులోకి తెచ్చారు. ఓ రకంగా ధోనీ ఎదుగుదలలో సహాయ్ పాత్ర కూడా కీలకం అని చెప్పాలి. ధోనీ కూడా అనేక సందర్భాల్లో ఆయనను ప్రస్తావించారు.


More Telugu News