మంత్రి పదవులు ఇస్తామంటూ ఎన్డీయే ఎమ్మెల్యేలను ఊరిస్తున్న లాలు.... సుశీల్ కుమార్ మోదీ తీవ్ర ఆరోపణలు

  • దాణా స్కాంలో రాంచీ జైల్లో ఉన్న లాలు
  • తాను లాలును హెచ్చరించానన్న సుశీల్ కుమార్
  • లాలుకు ఫోన్ ఎలా వచ్చిందన్న ఝార్ఖండ్ బీజేపీ చీఫ్
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దాణా స్కాంలో జైల్లో ఉన్న లాలు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తూ, తమవైపు వస్తే మంత్రి పదవులు ఇస్తామంటూ ప్రలోభపెడుతున్నారని వెల్లడించారు. రాంచీలో జైలు జీవితం గడుపుతున్న లాలు ఫోన్ కాల్స్ ద్వారా ఎన్డీయే కూటమికి చెందిన శాసనసభ్యులను ఊరిస్తున్నారని తెలిపారు.

లాలు ఏ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారో తెలుసుకుని తాను ఆ నెంబర్ కు కాల్ చేశానని సుశీల్ కుమార్ మోదీ వెల్లడించారు. తన ఫోన్ కాల్ ను లాలునే డైరెక్ట్ గా ఎత్తారని, జైలు నుంచి ఎలాంటి దరిద్రగొట్టు ఎత్తుగడలు వేయవద్దని హెచ్చరించానని, ఇలాంటి కుయుక్తులతో నెగ్గలేవని చెప్పానని వివరించారు. అంతేకాదు, తాను ఫోన్ చేసిన నెంబర్ ను కూడా సుశీల్ కుమార్ మోదీ తన ట్వీట్ లో పంచుకున్నారు. కాగా, ఆ ఫోన్ నెంబరు లాలు సహాయకుడు ఇర్ఫాన్ అన్సారిదని తెలుస్తోంది.

లాలు ఫోన్ కాల్స్ వ్యవహారం మీడియాలో రావడంతో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఎందుకు కళ్లు మూసుకుని ఉన్నారంటూ ఝార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ ప్రశ్నించారు. రాంచీ జైలులో ఉన్న లాలు ఎలా ఫోన్ కాల్స్ చేయగలుగుతున్నాడని ఆయన ప్రశ్నించారు.

కాగా, సుశీల్ కుమార్ మోదీ ఆరోపణలపై ఆర్జేడీ వర్గాలు స్పందించాయి. లాలు ఫోబియాతో సుశీల్ కుమార్ వణికిపోతున్నట్టుందని ఎద్దేవా చేశాయి. వాస్తవిక సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ వ్యాఖ్యానించారు.


More Telugu News