అహ్మద్ పటేల్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

  • కరోనాతో కన్నుమూసిన అహ్మద్ పటేల్
  • విషాదకర దినం అని పేర్కొన్న రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ పార్టీకి మూలస్తంభంలా నిలిచారని వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాతో మరణించడం పట్ల అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది నిజంగా విషాదకర దినం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అహ్మద్ పటేల్ ఓ మూలస్తంభం లాంటివారని కొనియాడారు. ఆయన శ్వాస, ఆశ అన్నీ కాంగ్రెస్ పార్టీయేనని కీర్తించారు. అనేక సంక్షోభ సమయాల్లో పార్టీకి వెన్నంటి నిలిచారని తెలిపారు. తమకు ఆయన ఓ ఆస్తిలాంటివారని రాహుల్ అభివర్ణించారు. 'అలాంటి వ్యక్తి ఇక లేరు. ఆయన కుటుంబ సభ్యులు ఫైసల్, ముంతాజ్ లకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

అటు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అహ్మద్ పటేల్ కన్నుమూత పట్ల స్పందించారు. అహ్మద్ పటేల్ ఓ తెలివైన, అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త అని కొనియాడారు. తాను సలహాల కోసం ఆయనను సంప్రదిస్తుంటానని వెల్లడించారు. ఓ స్నేహితుడిలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని, ఆయన మరణంతో శూన్యం ఆవహించినట్టయిందని తెలిపారు.


More Telugu News