సంప్రదాయానికి భిన్నంగా పెళ్లిలో సూటు ధరించిన వధువు.. నెటిజన్ల కామెంట్లు

  • సహజీవన సహచరుడ్ని పెళ్లాడిన సంజన రిషి
  • సూటు ధరించడంపై భిన్న స్పందనలు
  • స్వాగతించిన సెలబ్రిటీలు
  • సామాజిక వేదికల్లో తిట్ల వర్షం
హిందూ సంప్రదాయంలో వధూవరుల వస్త్రధారణకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోని పలు ప్రాంతాలను అనుసరించి పట్టుచీరలు, లెహంగాలు ధరించడం ఆనవాయితీ. అయితే ఇండో-అమెరికన్ బిజినెస్ ఉమన్ సంజన రిషి మాత్రం సంప్రదాయాలకు గుడ్ బై చెబుతూ తన పెళ్లిలో మగరాయుడిలా సూటు ధరించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 29 ఏళ్ల సంజన రిషి వివాహం సెప్టెంబరు 20న ఢిల్లీలో జరిగింది. ఆమె ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ధృవ్ మహాజన్ (33)ను పెళ్లాడారు. వీరిద్దరూ సంవత్సరకాలంగా సహజీవనం చేస్తున్నారు.

ఆధునిక భావాలున్న సంజన రిషి పెళ్లికి ముందు అమెరికాలో కార్పొరేట్ న్యాయవాదిగా పనిచేశారు. సంజన, ధృవ్ తమ వివాహాన్ని అమెరికాలో చేసుకోవాలని, ఆపై ఢిల్లీలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే కరోనా వ్యాప్తితో వీరు తమ ప్రణాళికలో మార్పు చేసుకోకతప్పలేదు. తాజాగా ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో సంజన నిర్ణయంపై భిన్న స్పందన వెలువడ్డాయి.

సెలబ్రిటీలు సంజన సూటు వేసుకోవడాన్ని సమర్థించగా, కొన్ని సామాజిక వేదికల్లో మాత్రం తిట్ల వర్షం కురిసింది. దీనిపై సంజన రిషి స్పందిస్తూ... భారతదేశంలో పురుషులు వివాహం సందర్భంగా సూట్లు ధరిస్తే ఎవరూ అడగరని, కానీ ఓ మహిళ సూటు ధరిస్తే ఎందుకు అభ్యంతరం అని ప్రశ్నించారు.


More Telugu News