స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి: మండల నేతలతో చంద్రబాబు

స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి: మండల నేతలతో చంద్రబాబు
  • అన్ని మండలాల నేతలతో చంద్రబాబు సమావేశం
  • స్థానిక ఎన్నికలపై వైసీపీ భయపడుతోందని వ్యాఖ్యలు
  • నేరం చేయకుండానే కేసులు పెడుతున్నారని ఆరోపణ
ఏపీలోని అన్ని మండలాల టీడీపీ నాయకులతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే గెలవలేమని వైసీపీ భయపడుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల్లోనూ వైసీపీపై వ్యతిరేకత వచ్చిందని, వైసీపీని వదిలించుకోకపోతే రాష్ట్రానికి పట్టిన చీడ వీడదని అన్నారు.

ఏ నేరం చేయకుండానే ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో చేయాల్సిన అప్పును జగన్ ఒక్క ఏడాదిలోనే చేశారని విమర్శించారు. పేదల సొంతింటి కలను ఈ ప్రభుత్వం భగ్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో నిర్మించిన ఇళ్లన్నీ పేదలకు అప్పజెప్పకపోతే ఉద్యమిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఇక, తిరుపతి ఉప ఎన్నికను టీడీపీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని చంద్రబాబు ఉద్బోధించారు.



More Telugu News