హైదరాబాద్‌లో తాము చేసిన అభివృద్ధి పనులపై వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్‌!

  • ఆరేళ్ల నగర అభివృద్ధి మీ కళ్ల ముందుంచుతున్నా 
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలని వినతి
  • ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశామని వ్యాఖ్య
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి పనులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్లీ తమ పార్టీనే గెలిపించాలని ఆయన కోరారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ ఆశీర్వాదంతో ఆరేళ్లలో మన నగరంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశాం. హైదరాబాద్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు డిసెంబర్ 1 నాడు కారు గుర్తుకు ఓటేద్దాం’ అని కేటీఆర్ కోరారు.

టీఆర్ఎస్ పాలనలో ఆరేళ్ల నగర అభివృద్ధి మీ కళ్ల ముందు ఉంచుతున్నామంటూ ఈ వీడియోలో చెప్పారు. హైదరాబాద్‌లో 24 గంటల విద్యుత్‌ సరఫరా, తాగునీటి సరఫరా అందిస్తున్నామని చెప్పారు. మెరుగైన ప్రజారవాణ, రహదారుల నిర్మాణం, డబుల్‌ బెడ్‌రూం‌ ఇళ్లు వంటివి అందించామని వివరించారు. అలాగే, బస్తీ దవాఖానాలు, మెరుగైన పోలిసింగ్‌, అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రూ.5కే భోజనం సదుపాయం, చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి, అడవుల పెంపకం వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని కేటీఆర్ ఈ వీడియో ద్వారా చూపించారు. కారు గుర్తుకు ఓటు వేయడమంటే అభివృద్ధిని కాపాడుకోవడమేనని పేర్కొన్నారు.


More Telugu News