కోహ్లీ కన్నా రోహిత్ శర్మ కెప్టెన్సీ అత్యుత్తమమన్న గౌతమ్ గంభీర్!

  • వీలు చిక్కినప్పుడల్లా కోహ్లీపై విమర్శలు
  • కోహ్లీ మంచి కెప్టెన్ అయినా రోహిత్ బెస్ట్
  • రోహిత్ ను ఎందుకు కెప్టెన్ చేయలేదని ప్రశ్న
గత కొంతకాలంగా తనకు వీలు చిక్కినప్పుడల్లా విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు గుప్పిస్తున్న మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్, మరోసారి నోరు విప్పారు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించే క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్ తో కలిసి మాట్లాడిన గంభీర్, కోహ్లీ మంచి కెప్టెన్ అని, అయినప్పటికీ, రోహిత్ శర్మ అత్యుత్తమ నాయకుడని, వారిద్దరికీ మధ్య ఎంతో తేడా ఉందని అన్నారు.

కాగా, ఐపీఎల్ 13వ సీజన్ లో తాను కెప్టెన్ గా ఉన్న ముంబై ఇండియన్స్ ను గెలిపించిన రోహిత్ శర్మ, ఐదోసారి విజయవంతమైన కెప్టెన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఇంతవరకూ ఒక్కసారి కూడా కప్ ను గెలుచుకోలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఐపీఎల్ లో ఆటతీరు ఆధారంగా ఆస్ట్రేలియా పర్యటనకు కొందరు ఆటగాళ్లను ఎంపిక చేశారని గుర్తు చేశారు.

వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, నటరాజన్, కుల్ దీప్ యాదవ్ తదితరులను ఐపీఎల్ ప్రదర్శన చూసి ఎంపిక చేశారని, కెప్టెన్ విషయంలోనూ అదే ప్రామాణికతలను ఎందుకు పాటించడం లేదని గౌతమ్ గంభీర్ ప్రశ్నించారు. పొట్టి ఫార్మాట్ లో పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కోహ్లీ కన్నా రోహిత్ వేగంగా స్పందిస్తాడని, ఎంత ఒత్తిడి ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకుంటాడని పార్ధివ్ పటేల్ వ్యాఖ్యానించడం గమనార్హం.


More Telugu News