‘హిందూస్థాన్’ పదాన్ని ‘భారత్’గా మార్చాల్సిందే.. ప్రమాణస్వీకారం సందర్భంగా బీహార్ ఎంఐఎం ఎమ్మెల్యే పట్టు

  • ఎమ్మెల్యే డిమాండ్‌తో విస్తుపోయిన ప్రొటెం స్పీకర్
  • చివరికి భారత్ అని పలికేందుకు అంగీకారం
  • ‘హిందూస్థాన్’పై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఎమ్మెల్యే
ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా బీహార్ అసెంబ్లీలో కాసేపు గందరగోళం నెలకొంది. ఎంఐఎం బీహార్ చీఫ్, ఆ పార్టీ ఎమ్మెల్యే అఖ్తరుల్ ఇమాన్ నిన్న ప్రమాణ స్వీకారానికి ముందు ఉర్దూ డ్రాఫ్ట్‌లో ఉన్న ‘హిందూస్థాన్’ అనే పదాన్ని తొలగించాలని, దాని స్థానంలో ‘భారత్’ అని చేర్చాలని కోరారు.

దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే డిమాండ్‌తో విస్తుపోయిన ప్రొటెం స్పీకర్ జితన్‌రామ్ మాంఝీ ఎమ్మెల్యేకు బదులిస్తూ అలా కుదరదని, ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేసేవారు హిందూస్థాన్ అనే చెప్పాలని అన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే పట్టువీడకపోవడంతో చివరికి ‘భారత్’ అనే పదాన్ని ఉపయోగించేందుకు స్పీకర్ అనుమతి ఇచ్చారు.

అనంతరం తన వ్యాఖ్యలపై అఖ్తరుల్ వివరణ ఇచ్చారు. హిందూస్థాన్ అని పలకడంలో తనకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం లేదన్నారు. తానీ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదన్నారు. రాజ్యాంగం ఉపోద్ఘాతంలో ఏ భాషలోనైనా ‘భారత్’ అనే పదమే ఉంటుందని మాత్రమే చెప్పానని అన్నారు. రాజ్యాంగం పేరిట ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తాను దానినే అనుసరించాలని కోరానని, అందుకే హిందూస్థాన్ అనే పదాన్ని తొలగించమన్నానని పేర్కొన్నారు.


More Telugu News