క్రియాశీలక కార్యకర్తల బీమా పత్రాలను పవన్ కల్యాణ్ కు అందించిన బీమా సంస్థ ప్రతినిధులు

  • ఇటీవల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు
  • క్రియాశీలక సభ్యులకు బీమా చేయించిన పవన్
  • రూ.5 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా
జనసేన పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న కార్యకర్తలకు ఇటీవలే క్రియాశీలక సభ్యత్వం ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు క్రియాశీలక సభ్యులకు పార్టీ తరఫున అధినేత పవన్ కల్యాణ్ బీమా కూడా చేయించారు. తాజాగా ఈ బీమా పత్రాలను యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ సంస్థ ప్రతినిధులు హైదరాబాదులో పవన్ కు అందించారు. బీమా విధివిధానాలను ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, కార్యకర్తల భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టామని, ఇందులో బీమా సంస్థ నుంచి పూర్తి సహకారం అవసరమని పేర్కొన్నారు. కాగా, ఈ బీమాలో భాగంగా జనసేన క్రియాశీలక సభ్యులకు వ్యక్తిగతంగా రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, ప్రమాద సమయంలో రూ.50 వేల వరకు వైద్య ఖర్చులు అందిస్తారు.

బీమా అంశంలో కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News