దేవతల యాగానికి రాక్షసులు అడ్డుపడినట్టు చంద్రబాబు ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డుపడుతున్నాడు: బొత్స

  • పేదల సొంతింటి కల నెరవేరడం బాబుకు ఇష్టంలేదన్న బొత్స
  • పంచభూతాలను కూడా దోచుకుతిన్నాడని విమర్శలు
  • మేనిఫెస్టో హామీల్లో 90 శాతం నెరవేర్చామని వెల్లడి
ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల సొంతింటి కల నెరవేరడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టంలేదని ఆరోపించారు. లోక సంక్షేమం కోరి దేవతలు యాగం చేస్తున్నప్పుడు రాక్షసులు అడ్డుపడినట్టు చంద్రబాబు ఇళ్ల స్థలాల పంపిణీకి అడ్డుపడుతున్నాడని విమర్శించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పంచభూతాలను కూడా పరమాన్నంలా దోచుకుతిన్నాడని అన్నారు.

రాష్ట్రంలో డిసెంబరు 25న 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేస్తామని, 17 లక్షల మంది లబ్దిదారులు వారి ఇల్లు వారే నిర్మించుకునే విధంగా నిధులు అందజేస్తామని బొత్స వెల్లడించారు. తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 90 శాతం నెరవేర్చామని, తమ ప్రభుత్వం దివంగత వైఎస్సార్ స్ఫూర్తితో ముందుకు సాగుతోందని ఉద్ఘాటించారు. తమది మాటల సర్కారు కాదని, చేతల్లో చూపిస్తామని అన్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


More Telugu News