వైఎస్సార్ అభిమానులు నన్ను అర్థం చేసుకోవాలి... ఆ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా: రఘునందన్ రావు

  • రఘునందన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్
  • తాను వైఎస్సార్ ను కించపరిచేలా మాట్లాడలేదని వివరణ
  • కేసీఆర్ వ్యాఖ్యలు గుర్తుచేశానని వెల్లడి
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, తానెప్పుడూ ఆ మహానుభావుడ్ని కించపరిచేలా మాట్లాడలేదని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు.

"వెనుకటి ఒకాయన గిట్లనే మాట్లాడి గట్లనే పోయిండు... పావురాల గుట్టకు! నువ్వు కూడా గంతే. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది" అని రఘునందన్ వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ శ్రేణులు, వైఎస్సార్ అభిమానులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ రఘునందన్ పై ట్రోలింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్ స్పందించారు.

"సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం గురించి మీడియా మిత్రులతో మాట్లాడుతున్న సందర్భంలో కొన్నివ్యాఖ్యలు చేశాను. కేసీఆర్ గారు గతంలో వైఎస్సార్ పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నేను ఆ కుటుంబానికి హెచ్చరిక చేసినట్టుగా మాట్లాడాను. అంతేతప్ప నేను వైఎస్సార్ ను కించపరుస్తూ మాట్లాడలేదు.

అయితే నేను వాడిన పదాల వల్ల వైఎస్సార్ అభిమానులు నొచ్చుకున్నట్టు మిత్రులు ఫోన్ చేసి చెబితే తెలిసింది. రాజశేఖర్ రెడ్డి గారిని గానీ, ఆయన కుటుంబసభ్యులను గానీ నేను ఎప్పుడూ అవమానిస్తూ మాట్లాడింది లేదు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను... దయచేసి తప్పుగా ట్రోల్ చేయకండి. నా వ్యాఖ్యల పట్ల మీరు బాధపడుతున్నందుకు చాలా చింతిస్తున్నాను. ఇలాంటి పరిస్థితి రావడం విచారకరం" అని రఘునందన్ రావు ఓ ప్రకటన చేశారు.


More Telugu News