హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ తీపి కబురు.. డిసెంబర్ నుంచి ఉచిత నీటి సరఫరా

  • వచ్చే నెల నుంచి వాటర్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు
  • సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్
  • లాక్ డౌన్ సమయంలో వాహనాల పన్ను రద్దు
జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. వచ్చే నెల నుంచి వాటర్ బిల్లులను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. 98 శాతం మంది ప్రజలకు 20 వేల లీటర్ల నీటిని ఫ్రీగా సరఫరా చేస్తామని వెల్లడించారు.

భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ధోబీఘాట్లను రిపేర్ చేస్తామని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో మోటార్ వాహనాల పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లకు వచ్చే నెల నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు.

హైదరాబాద్ నగరం ఒక అందమైన ఫ్లవర్ బొకే వంటిదని కేసీఆర్ అన్నారు. దేశంలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ అని చెప్పారు. మన దగ్గర గుజరాతీ గల్లీ, పార్సీ గుట్ట, అరబ్ గల్లీ వంటివి ఉన్నాయని... బెంగాలీ, కన్నడ, తమిళ సమాజాలు ఇక్కడకు వచ్చి మన సంస్కృతిలో లీనమయ్యాయని అన్నారు.

త్వరలోనే సమగ్ర జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. అధికారుల్లో బాధ్యతను పెంచేలా కొత్త చట్టానికి రూపకల్పన చేస్తామని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఎన్నో హైదరాబాదుకు తరలి వస్తున్నాయని తెలిపారు. జంట నగరాల్లో ఇప్పుడు నీటి కొరత లేదని చెప్పారు. పుష్కలంగా మంచి నీటి సరఫరా జరుగుతోందని కేసీఆర్ చెప్పారు.


More Telugu News