సెల్ ఫోన్ టారిఫ్ పెంపు అనేది అతిపెద్ద ఆపరేటర్ నిర్ణయంపై ఆధారపడివుంది:ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్

  • టెలికం పరిశ్రమను కాపాడాల్సిన అవసరం ఉంది
  • తొలుత టారిఫ్ లను మేము పెంచలేము
  • ధరలు పెంచకుంటే తీవ్ర నష్టం మాత్రం తప్పదు
  • తొలి స్టెప్ తీసుకునేందుకు తాము సిద్ధమన్న వోడాఫోన్ ఐడియా
అత్యాధునిక 5 జీ సాంకేతిక తరంగాల ధరలు పరిశ్రమకు స్నేహపూర్వకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, మొబైల్ టారిఫ్ లు తక్షణం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న 4జీ రేడియో తరంగాల వేలం టెలికం పరిశ్రమను కాపాడేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇండియాలో స్మార్ట్ ఫోన్ టారిఫ్ లను పెంచే అంశం అతిపెద్ద ఆపరేటర్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి వుందని, వారు పెంచితేనే, మిగతా వారికి ధరలు పెంచే వెసులుబాటు ఉంటుందని మిట్టల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 40 కోట్ల మంది వినియోగదారులను కలిగివున్న రిలయన్స్ జియో అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న సంగతి తెలిసిందే.

 ఆ తరువాత రెండో స్థానంలో ఎయిర్ టెల్ కొనసాగుతోంది. జియో టారిఫ్ లను పెంచకుండా, ఎయిర్ టెల్ తమ టారిఫ్ లను పెంచితే, కస్టమర్లు ఇతర టెలికంలవైపు వెళ్లిపోతారన్న అభిప్రాయంతో మిట్టల్ ఉన్నారు. ఇక వైర్ లెస్ మార్కెట్ వాటాలో జియో 35 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్ టెల్ కు 28 శాతం మార్కెట్ వాటా ఉందని ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గణాంకాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న తక్కువ టారిఫ్ లతో టెలికం ఇండస్ట్రీ మనుగడ ప్రశ్నార్థకమైందని, మార్కెట్ పరిస్థితులను, టెలికం సంస్థలు మౌలిక వసతుల కల్పన నిమిత్తం పెడుతున్న పెట్టుబడులకు అనుగుణంగా ప్రైసింగ్ విధానం ఉండాలని మిట్టల్ అభిప్రాయపడ్డారు. అయితే, ఒకేసారి భారీఎత్తున టారిఫ్ లను పెంచే పరిస్థితులు ఇండియాలో లేవని, పోటీలో ఉన్న సంస్థలన్నీ ఒకమాటపై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

కాగా, మిట్టల్ వ్యాఖ్యలను అనుసరించి, టారిఫ్ లను పెంచే విషయంలో ఎయిర్ టెల్ తొలి అడుగును వేయాలని భావించడం లేదని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టులో ఆయన మాట్లాడుతూ, ఇండియాలో కేవలం రూ.160కి 16 జీబీ డేటా లభిస్తోందని, ఈ పరిస్థితి అన్ని టెలికం సంస్థలకూ ఓ ట్రాజడీగా మారిందని వ్యాఖ్యానించారు.

అయితే, టారిఫ్ లను పెంచే విషయంలో ముందడుగు వేసేందుకు తామేమీ వెనుకాడబోవడం లేదని పేర్కొన్న వోడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర టక్కర్, ఈ రంగం ఎంతో ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. ఈ రంగంలో ఉన్న అత్యధిక పోటీతత్వమే, టారిఫ్ లను పెంచకుండా అడ్డుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News