న్యూఢిల్లీలో జెయింట్ ఎయిర్ ప్యూరిఫయర్ ను ఆవిష్కరించిన గౌతమ్ గంభీర్!

  • మూడవ వాయు శుద్ధి యంత్రాన్ని ప్రారంభించిన గంభీర్
  • కృష్ణ నగర్ మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు
  • తాను ఇంట్లో ఊరికే కూర్చోబోనన్న గంభీర్
న్యూఢిల్లీలో ఎంతో రద్దీగా ఉండే కృష్ణ నగర్ మార్కెట్ ప్రాంతంలో భారీ ఎయిర్ ప్యూరిఫయర్ ను తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రారంభించారు. ఇప్పటికే ఈ తరహా వాయు శుద్ధి యంత్రాలను లజపత్ నగర్, గాంధీ నగర్ మార్కెట్లలో ఏర్పాటు చేయగా, ఇది మూడవది.

"ఈ ఎయిర్ ప్యూరిఫయర్ సమస్యను పూర్తిగా పరిష్కరించలేదు. అయితే, ఈ నగరంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, నేను కేవలం ఇంట్లో కూర్చుని పరిస్థితులు దిగజారే వరకూ వేచి చూస్తుండలేను. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత. అయితే, ఈ పనిని రాష్ట్ర ముఖ్యమంత్రి, అతని సహచరులు గాలికి వదిలేశారు" అని గంభీర్ వ్యాఖ్యానించారు.

కాగా, ఈ వాయు శుద్ధి యంత్రాలు దాదాపు 12 అడుగుల ఎత్తులో ఉండి, 1000 చదరపు మీటర్ల పరిధిలోని గాలిని శుద్ధి చేస్తుంటాయి. రోజుకు ఇవి రెండు లక్షల ఘనపు మీటర్ల శుభ్రమైన గాలిని అందిస్తాయని ఆయన అన్నారు. తన నియోజకవర్గంలోని అన్ని రద్దీ ప్రాంతాల్లో ఈ తరహా యంత్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని గంభీర్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం జనవరిలో తొలి ఎయిర్ ఫ్యూరిఫయర్ ను కేంద్ర ఢిల్లీ పరిధిలోని లజపత్ నగర్ లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇవి దాదాపు ఫుట్ బాల్ మైదానం అంత ప్రాంతంలోని గాలిలోని కాలుష్యాన్ని తొలగించి శుభ్రపరుస్తుంటాయి.


More Telugu News