తదుపరి కరోనా వేవ్ ఓ సునామీయే: ఉద్ధవ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

  • ప్రస్తుతానికి నియంత్రణలోనే ఉన్న కరోనా
  • ప్రజలు జాగ్రత్తలు మరుస్తున్నారన్న ఉద్ధవ్
  • మాస్క్ లు వేసుకోకుండా తిరుగుతున్నారని ఆగ్రహం
  • వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రాదని ప్రజలకు హెచ్చరిక
మహారాష్ట్ర ప్రజలు అందిస్తున్న సహకారంతో కరోనా మహమ్మారిని ప్రస్తుతానికి నియంత్రణలో ఉంచామని, అయితే, ప్రజలు కరోనా సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను ఏ మాత్రమూ మరువరాదని, ఈ వ్యాధి రెండు, మూడవ వేవ్ లు సునామీలా విరుచుకుపడే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు.

 "ఇప్పటివరకూ మన పండగలను చాలా జాగ్రత్తలు తీసుకుని జరుపుకున్నాం. అది వినాయక చవితికానీ, దసరా కానీ. దీపావళిని కూడా అలానే జరిపాము. బాణసంచా కాల్చవద్దని కోరగా, మీరు పాటించారు. అందువల్లే రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య నియంత్రణలో ఉంది" అని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన వ్యాఖ్యానించారు.

"అయితే నాకు మీపై కొంత కోపంగా ఉంది. దీపావళి తరువాత రోడ్లపై జనసమ్మర్ధం పెరిగింది. చాలా మంది మాస్క్ లు ధరించకుండా కనిపిస్తున్నారు. కొవిడ్ వెళ్లిపోయిందని ఎంతమాత్రమూ అనుకోవద్దు. అజాగ్రత్తగా ఉండవద్దు. పశ్చిమ దేశాలను చూడండి. ఢిల్లీ, అహ్మదాబాద్ లను చూడండి. రెండో దశ కేసులు సునామీలా వస్తున్నాయి. అహ్మదాబాద్ లో రాత్రి కర్ఫ్యూ సైతం అమలవుతోంది.

ఎక్కువమంది ప్రజలు ఒకచోటకు చేరుతుండటంతోనే కరోనా చావడం లేదు. మరింత బలోపేతం అవుతోంది. వ్యాక్సిన్ కూడా ఇంకా రాలేదు. డిసెంబర్ లో వ్యాక్సిన్ వచ్చినా, మహారాష్ట్రకు ఎప్పుడు వస్తుందో చెప్పలేము. రాష్ట్రంలోని 12 కోట్ల మందికీ రెండు డోస్ లను ఇవ్వాలంటే, దాదాపు 25 కోట్ల డోస్ లు కావాలి. దీనికి సమయం పడుతుంది. కాబట్టి, మీ జాగ్రత్తలు మీరే తీసుకోవాలి" అని ఉద్ధవ్ సూచించారు.

"కరోనా బారిన పడిన వారికి సరిపడినన్ని బెడ్లు లేకున్నా, మన ఆరోగ్య కార్యకర్తలు వ్యాధి బారిన పడినా, మనల్ని ఎవరూ కాపాడలేరు. మనం ఇప్పటికీ పాఠశాలలను ప్రారంభించే స్థితిలో లేము. అయితే, మరోమారు లాక్ డౌన్ విధించే ఆలోచన మాత్రం మాకు లేదు. ప్రజలే జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అందుకే మరోమారు చెబుతున్నా. ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరగవద్దు. మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. అదే శ్రీరామరక్ష" అని హెచ్చరించారు.


More Telugu News