ఉగ్రవాదులు వచ్చిన సొరంగాన్ని గుర్తించిన భారత సైన్యం!

  • గత గురువారం భారీ ఎన్ కౌంటర్
  • నలుగురు జైషే ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
  • ఆపై జరిపిన సెర్చ్ ఆపరేషన్ లో బయటపడిన టన్నెల్
  • ఈ సొరంగం నుంచే వచ్చారన్న అధికారులు
గత వారంలో జమ్మూ కశ్మీర్ పరిధిలోని నగ్రోటా సమీపంలో జరిగిన ఎన్ కౌంటర్ లో పాక్ నుంచి చొరబడిన నలుగురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఆపై బీఎస్ఎఫ్ జవాన్లు సోదాలు జరుపగా, సాంబా జిల్లాలో ఓ భారీ సొరంగం బయటపడింది. దాదాపు 150 మీటర్ల పొడవున్న ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారానే ఉగ్రవాదులు ఇండియాలోకి చొరబడి వుంటారని రాష్ట్ర పోలీస్ చీఫ్ దిల్ బాగ్ సింగ్ పేర్కొన్నారు.

ఈ సొరంగాన్ని బీఎస్ఎఫ్ అధికారి ఎన్ఎస్ జమ్వాల్, సీనియర్ పోలీసు అధికారి ముఖేష్ సింగ్ లతో కలిసి పరిశీలించిన దిల్ బాగ్ సింగ్, మీడియాతో మాట్లాడారు. వీరు ఓ ట్రక్ లో ప్రయాణిస్తుండగా, గురువారం నాడు బాన్ టోల్ ప్లాజా వద్ద గుర్తించిన సైన్యం, ఉగ్రవాదులను లొంగిపోవాలని కోరిందని, వారు ఫైరింగ్ మొదలుపెట్టగా, ఎన్ కౌంటర్ జరపాల్సి వచ్చిందని అన్నారు. వారి నుంచి 11 ఏకే అసాల్ట్ రైఫిల్స్, మూడు పిస్టల్స్, 29 గ్రనేడ్స్, ఆరు యూబీజీఎల్ గ్రనేడ్లను రికవరీ చేశామని, వారు పెద్ద విధ్వంస ప్రణాళికతోనే ఇండియాకు వచ్చారని అన్నారు.

ఎన్ కౌంటర్ తరువాత, పోలీసులు విస్తృతంగా గాలింపు, సోదాలు జరిపారని, అందులో భాగంగానే ఈ టన్నెల్ ను గుర్తించామని దిల్ బాగ్ సింగ్ వెల్లడించారు. ఈ టన్నెల్ ను పూర్తిగా నేలమట్టం చేయడంలో సఫలమయ్యామని, ఇప్పటికే ఎన్ కౌంటర్ గురించి పాక్ దౌత్యాధికారులకు సమన్లు కూడా జారీ చేశామని గుర్తు చేశారు. మన జవాన్ల నిబద్ధత, అంకితభావం కారణంగానే దేశం సురక్షితంగా ఉందని అన్నారు.

ఇక ఈ టన్నెల్ భూమి ఉపరితలానికి 25 నుంచి 30 మీటర్ల లోతున 2.5 మీటర్ల వెడల్పుతో ఉందని, దీన్ని ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆధారంగా నిర్మించారని, ఈ సొరంగమార్గం పైకి కనిపించకుండా ఉండేందుకు గడ్డిని కప్పి ఉంచారని బీఎస్ఎఫ్ అధికారి ఎన్ఎస్ జమాల్ వివరించారు. గడచిన మూడు నెలల్లో సాంబా సెక్టారులో జవాన్లు కనిపెట్టిన రెండో టన్నెల్ ఇదని ఆయన తెలిపారు.


More Telugu News