మహమ్మారి మళ్లీ విరుచుకుపడేలా ఉంది.. జాగ్రత్త: కేసీఆర్

  • దేశంలో పలు రాష్ట్రాల్లో మళ్లీ వెలుగుచూస్తున్న కేసులు
  • రెండో దశ వచ్చినా తట్టుకుని నిలబడ గలిగేలా రాష్ట్రం
  • ఆక్సిజన్ సౌకర్యంతో 10 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి
కరోనా వైరస్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగానికి సూచించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయని, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోనూ కేసులు వెలుగు చూస్తున్నాయని, ఫలితంగా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం కనిపిస్తోందని అన్నారు. ఒక వేళ సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకుని నిలబడగలిగేలా రాష్ట్రం సిద్ధంగా ఉండాలని, అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని ప్రగతిభవన్‌లో నిన్న అధికారులతో నిర్వహించిన సమీక్షలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో మళ్లీ కరోనాకు ముందునాటి పరిస్థితులు నెలకొంటున్నాయని, కేసుల సంఖ్య బాగా తగ్గిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 2.1 శాతంగా ఉండగా, రికవరీ రేటు 94.03 శాతం ఉందని తెలిపారు. మరణాల రేటు చాలా తక్కువగా ఉందని, అయినప్పటికీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కరోనా చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా పదివేల పడకలు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం కష్టపడుతోందని, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని సూచించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.


More Telugu News