శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి వినుత ఇంటిపై దాడి చేయడం గర్హనీయం: పవన్ కల్యాణ్

  • ఓ యువకుడు వినుత ఇంటిని ధ్వంసం చేశాడన్న పవన్
  • వినుత కుటుంబంపైనే కేసు నమోదు చేశారని వెల్లడి
  • జనసేన చూస్తూ ఊరుకోదని స్పష్టీకరణ
శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్చార్జి వినుత ఇంటిపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆ యువకుడు వినుత ఇంటిని, వాహనాన్ని ధ్వంసం చేస్తే పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆరోపించారు.

బాధితురాలైన వినుత కుటుంబంపైనే పోలీసులు కేసు నమోదు చేయడం ఏం న్యాయమని ప్రశ్నించారు. బాధితులపైనే పోలీసు కేసులు నమోదయ్యాయంటే వైసీపీ నేతల ఒత్తిళ్లు ఏస్థాయిలో ఉన్నాయో తేటతెల్లం అవుతోందని విమర్శించారు. వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని చట్టప్రకారం విధి నిర్వర్తించాల్సిన పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్టు చేస్తుంటే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని పవన్ కల్యాణ్ నిలదీశారు.

అధికార పక్షం చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంగా వైసీపీ కనుసన్నల్లో నడిచిన పోలీసులు జనసేన శ్రేణులను ఇబ్బందులకు గురిచేశాయని, ఇప్పుడు మరోమారు బాధిత కుటుంబంపైనే ఎదురుకేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ అప్రజాస్వామిక పద్ధతుల్లో వెళుతూ గూండాయిజానికి పాల్పడితే జనసేన చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. కచ్చితంగా నిలదీసి ప్రశ్నిస్తామని తెలిపారు.


More Telugu News